September 16, 2008


పాపం పసి వాళ్ళు


పాల బుగ్గల పసి వాళ్ళము


ఎగిరి గంతులేసే లేగదూడలం


ఆకసాన మిరుమిట్లు గొలిపే తారాజువ్వలం


అందరిలా ఆటలాడే వయసేమాది


అమ్మ చేతి ముద్ద తినాలనే ఆశే మాది


కానీ మేం విధి వంచితులం...విధివంచితులం


ఎన్నో ఆశలు ఎన్నో కలలు కంటూనే ఉంటాం-


గొప్పోళ్ళ పిల్లల్ని ఆడిస్తూ,పాడిస్తూ,పనిచేస్తూ....


అమ్మా,నాన్నల తోడు లేక, ఆకలితో అలమటిస్తూ..


వెట్టిచాకిరి చేస్తూఉంటాం... చేస్తూచేస్తూఉంటాం..!


మా చుట్టూ అన్నీ ఉన్నా..కానీ మాకు ఏవీ అందవు


అర చేతిలో బొబ్బలు,కాళ్ళమీద వాతలు తప్ప !!


కన్నీటిధారలు,చింపిరి జుట్టు, మాసిన బట్టలు-


ఆవిరౌతున్న మా బాల్యానికితిరుగులేని గుర్తులు !


అందరి పిల్లల్లా మమ్మల్ని చూడండి


పని పిల్లలమని పాపం తలచండి !!......


September 15, 2008


ప్రకృతి

ఈ అనంతమైన విశ్వంలో

సజీవమైన సాక్షాత్కారం ప్రకృతి!!

ప్రకృతి లోని అందాలు మనసుకు

హత్తుకొనే అంతులేని సంతోషాలు!!

సంధ్యా సమయంలో వీచే పిల్ల తెమ్మెరలు-

ఆ గాలి సవ్వడిలో వినిపించే పిచ్చుకల రావాలు

వీనుల విందైన సంగీత సరాగాలు!!
సుగంధ పరిమళాలు వెదజల్లే మందార మకరందాలు
ప్రకృతి జీవకోటికి ఇచ్చే అంతులేని వరాలు !!

తెలుగు భాషా దినోత్సవ సందర్బముగ

వందనం వందనం తెలుగు భాషకు వందనం

శుభదినం,శుభదినం మాతృభాషకు శుభదినం

తేనెలొలికే తెలుగుభాషకు,ఏది సాటి లేదురా

అందమైన మాతృభాషకు ఏది పోటీ కాదురా:

అలనాడు రాయలవారి మాట దేశ భాషలందు తెలుగులెస్స!

తమిలనాట కవి సుబ్రమణ్య భారతి మాట సుందరతెలుంగు!

నాటి నన్నయ నందనవనంలో వికసించిన తెలుగుపదాలు

నేటి శ్రీశ్రీ కవితా ఉప్పెనలో ఎగసి పడిన తెలుగు పదగర్జనలు!

కవిసామ్రాట్ కవిత్వంలో కదంతొక్కిన తెలుగు కవితా ఝరులు

ఝాషువా చేతిలో జాలువారిన జన తెలుగు పదాలు!

అల్లసాని వారి అల్లికలు, తెనాలి వారి తికమకలు

తేట తేట తెనుగుల మధుర రసాలు

నందమూరి వారి సంభాషణా చాతుర్యాలు

నలు దిక్కుల వ్యాపించెను తెలుగు భాషా వెలుగులు!

నేడు గిడుగు రామ్మూర్తి జన్మదినం

తెలుగు భాషకు పునరంకితదినం!!

September 8, 2008

శుభాకాంక్షలు

కవితా హృదయులందరికి సుస్వాగతం...ఈ రోజు ప్రారంభిస్తున్న నా కవితా ప్రవాహాన్ని చదివి ఆనందిస్తారని కోరుతూ...

నా హృదయ తరంగం
" కృష్ణవేణి తరంగాలు
నా హృదయ అంతరంగాలు
ఆ తరంగాల సవ్వడులు
మా స్నేహ ప్రతిధ్వనులు
ఎవరికి వినపడని మా శృతులు
ఎప్పటికి పలుకవు అప శృతులు
కల్మషం లేని మా హృదయాలు
ఎన్నటికి విడిపోని సహజీవన సంబంధాలు "
మీ మహేష్
యం.ఏ ,పి.యం.ఐ.ఆర్ ,(యం.బి.ఏ)
*********************