October 24, 2008

అనాథ బాలల జీవితం

ప్రపంచాన ఉదయించిన బాల్యం

అస్తమించే సూర్యునిలా వాలిపోతూ ఉంది

ఏ కన్నతల్లి విసరి వేసెనో

ఏ అయ్య వదలివేసెనో

ముక్కుపచ్చలారని చిన్నారిబాల్యం -

జన జీవనంలో కృంగిపోతూ ఉంది!!

రైళ్ళలో జనం తినగా వదలినదే-

వారి ఆహారం,ఫ్లాట్ ఫారమే పట్టె మంచం!

బస్టాండ్ లో బరువులు మోసే -

వీరి చేతులు,

ఒక పూట కూడ ఫుల్ భోజనం

చేయలేని కాలే కడుపులు!

విధి వక్రించిన వీరి జీవితాలకు

గ్రహణం తొలగేరోజులు లేవా!!

అధికారములో ఉన్న పెద్దలారా!

ఆదరించే ఆంధ్రులారా!

మసివాడిన పసివాళ్ళను

ఆదరించండి!

మానవతా హృదయంతో అక్కున చేర్చుకోండి!!

-

రాయలసీమ ఆక్రందన

రాయలేలిన సీమలో రక్త ప్రవాహాలు

రతనాల సీమలో బాంబుల మోతలు!!

పాళెగాళ్ళ ధాటికి తెగిపడిన తలలెన్నో

రాక్షస రాజకీయానికి బలి అయిన సమిధలెన్నో!!

రెక్కాడితే గాని, డొక్కాడని బడుగు జీవితాలు

దొరల అనుచరులుగా అశువులు బాస్తున్న జీవచ్ఛవాలు!

నేతల మంది మార్బలం-ఆధిపత్యం అనుక్షణం!

అధినేతల గుప్పిట్లో అధికారుల శాసనం-

ఎలా నిలువ రించగలమని అధికారుల ఆగ్రహం!!

సీమ ప్రజల హృదయ ఘోష వినే వారెవ్వరు-

చీకట్లో చిరుదీపం వెలిగించే దెవ్వరు!!

ఓ! రాయలసీమ వితంతువా అరచి అరచి

గొంతు మూగ బోయిందా!

యేడ్చి యేడ్చి గుండె బరువెక్కిందా!!

నిను చూచి నీ చిన్నారుల చితికిన బ్రతుకును-

చూచైనా వీరికి కనువిప్పు కలుగుతుందా!!
_ ౦౦౦_